Grievance at TDP Office: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు. పలు అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇందులో పలువురు భూ ఆక్రమణల గురించి ఫిర్యాదు చేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో రెండు ఎకరాల 45 సెంట్లు ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారని వెంకయ్య అనే స్థానికుడు ఫిర్యాదు చేశాడు. ఈ స్థలం విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. స్థలం పక్కనే ఓ దివ్యాంగుడి ఇంటిని సైతం ఆక్రమించాలని చూస్తున్నారని తెలిపారు. ఎంతో విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
ఆ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఎదుర్కోలేక టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఆక్రమించిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని, అందులో ఎదైనా అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. స్థానికులకు అవసరమైన నీళ్ల ట్యాంకు, అందరికీ ఉపయోగపడేలా పార్కును కట్టించాలని అన్నారు. అదే విధంగా దివ్యాంగుడి ఇంటిని సైతం కొలతలు కొలిపించి, అతనికి ఇవ్వాలని వేడుకున్నారు.
ఇష్టారీతిన ఉద్యోగ నియామకాలు: వైఎస్సార్సీపీ హయాంలో కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైఎస్ జగన్ బావమరిది ప్రొఫెసర్ సురేంద్రనాథ్‌రెడ్డి రిజర్వేషన్లను తుంగలో తొక్కి, ఇష్టారీతిన ఉద్యోగ నియామకాలు చేపట్టారని అఖిల భారత యువజన సమాఖ్య కార్యదర్శి వి. గంగాసురేశ్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాగునీటి బోర్లు వేయకుండా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయకుండానే చేసినట్లు చూపించి వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ సమన్వయకర్త పి. జయరామరెడ్డి లక్షల్లో డబ్బులు దండుకున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి చెందిన ఎస్. శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీ కండ్రిక గొల్లగూడెం గ్రామంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకురాలు బి. విమలాదేవి తమకు రావాల్సిన 6 లక్షల రూపాయలకు పైగా సొమ్ము కాజేశారని ఉపాధి కూలీలు ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి తమకు ఇప్పించాలని కోరారు.