TDP, Janasena Candidates Election Campaign : పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య 700 ఎకరాలలో అక్రమ మైనింగ్ చేశారని, అలాంటి వ్యక్తి ఈసారి ఎంపీగా గెలిస్తే ఇంకా దారుణాలు చేస్తారని గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి తప్పించుకోవటం కోసం మళ్లీ పోటీ చేస్తున్నారని విమర్శించారు. గ్రామ గ్రామాన ప్రజలను పలకరిస్తూ సాగిన ప్రచారంలో పలుచోట్ల అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. తనది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే బ్లడ్ కాదని, గ్రావెల్ అవినీతిపరుల స్క్రిప్ట్ చదివే బ్లడ్ అని హెచ్చరించారు. రూ. రెండు వేల కోట్ల అవినీతి చేశారని చెబితే వైసీపీ నాయకుల వద్ద సమాధానం లేదన్నారు.
తన మీద పోటీ చేయడానికి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు మారిపోయారని, రోశయ్య నాలుగో వారని పెమ్మసాని చెప్పారు. గెలుపు ఎవరిదో ఆయనకూ తెలుసని, వెనక్కి వెళ్లిపోదామంటే, తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకూంతో ఆగిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమన్న పవన్ కల్యాణ్ మాటలను నిజం చేసి చూపించాలని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఓటర్లను కోరారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ
రోడ్లు గుంతలమయమయ్యాయి. నాకేమీ సంపాదనపై ఆశ లేదు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప మరేమీ లేదు. రోశయ్య మాదిరిగా వేల కోట్లు దోచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. రోశయ్య మింగేసిన డబ్బు ఎటుపోయింది. మీకు ముందు నాపై పోటీ చేయడానికి ముందు ముగ్గురు మారారు. రోశయ్య నాలుగో వాడు. గెలుపు ఎవరిదో ఆయనకూ తెలుసు. వెనక్కి వెళ్లిపోదామంటే, తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారు. - పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు లోక్సభ అభ్యర్థి
ఊరేగింపులో ప్రజలు, కార్యకర్తలు చూపిన అభిమానం స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. ఎంతో మంది రైతులు, మహిళలు, యువత ఎదురుచూస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుందాం. రైతులు కోరుతున్న ఎత్తిపోతల కూడా ప్రారంభించుకుందాం. రైతుల సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. - నాదెండ్ల మనోహర్, తెనాలి జనసేన అభ్యర్థి
జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ