KVP and Brahmanandam About Sharmila : అసలే ఆయన హాస్యబ్రహ్మ. ఎలాంటి సందర్భమైనా నవ్వులు పూయించడంలో ఆయన దిట్ట. ఓ వైపు రాజకీయ వేడి చెమటలు కక్కిస్తున్నా తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ నవ్వులు పూయించారు బ్రహ్మానందం. ఏపీలో షర్మిల ప్రభావంపై ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
'ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలుస్తారు? రాష్ట్రంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది?' రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ ఇదే! పెళ్లిళ్లయినా, ఫంక్షన్లయినా సరే, బస్సు ప్రయాణాలు, కాఫీ హోటళ్లలోనూ మిత్రుల మధ్య సంభాషణ అంతా ఏపీ రాజకీయాలపైనే. ఏపీలో రాజకీయ నాడిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఓ వైపు జగన్ సిద్ధం సభలు, మరోవైపు కూటమి అభ్యర్థుల ప్రచార హోరు నేపథ్యంలో మరికొద్ది రోజులు గడిస్తే తప్ప ప్రజలు ఎవరి పక్షమో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదు: షర్మిల - YS Sharmila allegations on Jagan
'జగనన్న వదిలిన బాణాన్ని' అంటూ గత ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన షర్మిల నేడు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు అందుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. బాబాయి వివేకానంద రెడ్డి హత్యోదంతం మొదలుకుని, ఐదేళ్లలో రాష్ట్రం వెనకబడిన తీరు, పెండింగ్ ప్రాజెక్టులు సహా పలు అంశాలపై జగన్ అసమర్ధ పాలనపై దుమ్మెత్తిపోస్తోంది. ఇచ్ఛాపురంలో ప్రారంభించిన ఎన్నికల ప్రచార ప్రస్థానం ఆరంభంలో ప్రజల దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొద్ది రోజులుగా తెరమరుగైంది. మధ్యలో రచ్చబండ సమావేశాలు, తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొన్న సభలు మినహా వార్తల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇండియా కూటమి పొత్తుల నేపథ్యంలో ఆమె సీపీఎం, సీపీఐతో కలిసి పలు సమావేశాల్లో పొల్గొంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీ, జనసేన జట్టుకట్టాయి. వైఎస్సార్సీపీని గద్దె దించడమే అంతిమ లక్ష్యమని కూటమి అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రోడ్ షోలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కానీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీని పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా పర్యటించడం తప్ప తిరిగి ఇప్పటివరకూ ఇటవైపు చూడనేలేదు. ప్రచారంలో వెనుకబడిన తరుణంలో ఆ పార్టీ శ్రేణులు కాస్త నైరాశ్యంలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు.
ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల - మద్దతు కూడగడుతున్న సునీత - Sunita Reddy meets YCP leaders
ఏపీలో షర్మిల ప్రభావంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ, హాస్యనటుడు బ్రహ్మానందం మధ్య జరిగిన ఓ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ ఫంక్షన్లో పక్కనే కూర్చున్న కేవీపీని పలకరించిన బ్రహ్మానందం, షర్మిల ప్రభావం ఎలా ఉందని అడిగారు. దీంతో ఆయన ఎలా చెప్పారో తెలియదు గానీ 'ఓపెనింగ్స్ బాగున్నాయ్ కానీ కలెక్షన్లే చాలా డల్‌గా ఉన్నాయి’' అంటూ బ్రహ్మానందం తన పక్కనున్న మరో వ్యక్తికి సినీ పరిభాషలో చెప్తున్న వీడియో చక్కర్లు కొడుతోంది.