Daggubati Purandeswari Comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును ఆశిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రజాసంక్షేమం పేరిట కేవలం అధికార పార్టీ కేవలం ఓటు రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై చర్చ: ఇప్పుడు రాష్ట్ర మంతటా ఇదే చర్చ జరుగుతోందని విజయవాడలో నిర్వహించిన పార్టీ జిల్లా సంయోజకులు, ఇన్‌ఛార్జిలు, విస్తారకులు రాష్ట్ర స్థాయి సమావేశంలో పురందేశ్వరి అన్నారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ జాతీయ సహ ఇన్‌ఛార్జి శివప్రకాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
దేశ భవిష్యత్ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది: పురందేశ్వరి
ప్రజలు బీజేపీను ఆశీర్వదిస్తారు: దేశంలో గత పదేళ్ల పాలనలో బీజేపీకి ఎలాంటి అవినీతి మరక లేదని, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలనను కేంద్రం అందిస్తోందని పురందేశ్వరి తెలిపారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రజల మనుసులను తాకిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 500 ఏళ్ల కల సాకారమైందని అన్నారు. రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ పాలనను ఆశిస్తున్నారని, ఖచ్చితంగా ప్రజలు బీజేపీను ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు.
పొత్తుల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది: వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ఇటీవల స్వీకరించిన దరఖాస్తులను గత రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు పరిశీలించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేశారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి అయిదు నుంచి పది మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. పొత్తుల గురించి జాతీయ నాయకత్వం స్పష్టత ఇస్తుందని, ఈ విషయాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందని మరోసారి పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్య్రం లేదు : దగ్గుబాటి పురందేశ్వరి
"భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోంది. కుటుంబ నేపథ్యం కలిగిన రాజకీయం చేయకుండా, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఏ విధంగా స్వచ్ఛమైన పరిపాలన దేశానికి అందించిందో ప్రజలంతా గమనించారు. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ప్రజలందరి మనసులను తాకింది. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనేది 500 ఏళ్ల కల. దీనిని మనం నరేంద్ర మోదీ నాయకత్వంలో సార్థకం చేసుకున్నాం. ఆ రాముని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై, అదే విధంగా భారతీయ జనతా పార్టీపై కూడా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సామర్థ్యాన్ని గుర్తించి, ప్రజలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం". - దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
బాల రాముడి ప్రతిష్ఠాపనతో శతాబ్ధాల కల సాకారమైంది : పురందేశ్వరి