Congress Leaders Election Campaign Across the State: పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు గురి చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్ల గ్రామంలో మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి కె. సుధాకర్ గెలుపు కోసం రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ప్రచార రథంతో ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అంతకుముందు మడకశిర మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్ లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీలొ చేరారు. లక్ష్మయ్యను రఘువీరా రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Congress Senior Leader Raghuveera Reddy: రఘువీరా రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో పేదలు, వృద్ధుల జీవితాలతో ఆడుకోవద్దంటూ పార్టీలకు హితవు పలికారు. ఇష్టానుసారంగా దోచుకుంటున్న పార్టీలను గుర్తించి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. మళ్లీ మన మడకశిర అనే నినాదంతో నియోజకవర్గంలో అర్థాంతరంగా ఆగిన హంద్రీనీవా, రైలు మార్గం పనులు, పారిశ్రామికవాడలో పరిశ్రమలు నెలకొల్పడం కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. లక్ష ఓట్ల లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగే హక్కు నాకే ఉందని ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పుట్టపర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే చేసింది శూన్యం: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 9 సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తామని పుట్టపర్తి నియోజక అభ్యర్థి మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో మధుసూదన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనే అంశాలతో ప్రజల ముందుకు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలకు వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అప్పుల పాలు అయిందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాక మునుపు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మాట తప్పారని అన్నారు. చెరువులు నింపుతామని, పరిశ్రమలు తెస్తానని, రైతులకు న్యాయం చేస్తానని వాగ్దానాలు చేశారు తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని అన్నారు. ప్రతి మండలానికి గార్మెంట్ షాప్ పెట్టిస్తానని మహిళలను మోసం చేశారని అన్నారు. కార్పొరేషన్ రుణాలు ఇస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల రుణాలు ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలోని ప్రజలు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తామని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని మధుసూదన్ రెడ్డి తెలిపారు.
జోరుగా ప్రచారం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఎం బలపరిచిన ఇండియా కూటమి సీపీఐ అభ్యర్థి జి. కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తూ ప్రచారం చేపట్టారు.