CM Jagan Speech at Pulivendula Public Meeting: వైఎస్సార్ జిల్లా పులివెందుల బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ ప్రత్యర్థులు, చెల్లెళ్లు, మీడియాపై రోజూ చేసే ఆరోపణలనే తిప్పితిప్పి ప్రజలకు చెప్పారు. తన తండ్రి వైఎస్సార్‌పై కక్ష సాధింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేవారు ఆయన వారసులెలా అవుతారని ప్రశ్నిచారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై జగన్ పాత పాటే పాడారు. కీలక నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి తరఫున వకల్తా పుచ్చుకుని కాపాడే ప్రయత్నం చేశారు.
మరోసారి వివేకా అంశం: బహిరంగ సభలో సీఎం జగన్ మరోసారి వివేక హత్య అంశాన్ని ప్రస్తావించారు. వివేకా చిన్నానను ఎవరు చంపారో ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసని, చిన్నాన్నను దారుణంగా హత్య చేసిన హంతకుడు బహిరంగంగా మాట్లాడుతున్నాడని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి హంతకులకు మద్దతు ఇస్తున్నది ఎవరో అందరికి తెలుసని ఆయన అన్నారు. మా ఇద్దరు చెల్లెళ్లు ప్రత్యర్థుల కుట్రలో భాగస్వాములు అయ్యారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకం చిన్నాన్నాను ఓడించిన వారితో మా వాళ్లు చెట్టాపట్ట లేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు.
అవినాష్ చిన్న పిల్లాడు: వివేక హత్యగురించి తెలియక అవినాష్ రెడ్డికి ఎవరు ఫోన్ చేస్తే సంఘటన స్థలానికి వెళ్లాడో తెలియదా అని జగన్ ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు సాహేతకమైనవన్న జగన్, ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అతనికి టికెట్ ఇచ్చాను అన్నారు. నాకంటే చిన్న పిల్లాడైన అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
చెల్లెళ్లుపై తీవ్ర విమర్శలు: తన సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పరోక్ష విమర్శలు చేశారు. వైఎస్ఆర్ వారసులమంటూ ఈ మధ్య కొందరు మాట్లాడు తున్నారని ఎవరు వైఎస్సార్ వారసులో ప్రజలకు తెలియదా అని అన్నారు. నాన్నపై కేసులు పెట్టించి, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన వాళ్లు వైఎస్సార్ వారసులా అని ప్రశ్నించారు. ప్రత్యర్థుల ఇళ్లకు పసుపు చీరతో వెళ్లి కుట్రలు చేస్తున్నవారు వారసులా అని ప్రశ్నించారు. నాకు ఏ పదవి ఇవ్వలేదని ఇటీవల నా బంధువులు మాట్లాడుతున్నారు తాను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది పేదలకు మేలు చేయడానికేనని అన్నారు. వైఎస్సార్ పేరును తుడిచేయాలని ప్రత్యర్థుల కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలకు తప్పని కష్టాలు: సభ అనంతరం జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జగన్ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ వైపు ఓ యువకుడు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. బారికేడ్లు దాటి జగన్ కారు వైపు దూసుకెళ్లడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. జగన్ పర్యటనతో పులివెందులలో సామాన్యులకు కష్టాలు తప్పలేదు. పోలీసుల ఆంక్షలతో విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం తిరిగి వెళ్లే వరకూ తమకు ఈ కష్టాలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేశారు.