HC on Janasena Party Symbol Issue: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ హైకోర్టులో జనసేనకు భారీ ఊరట లభించింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీంతోపాటు గతంలో ఈసీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఆ తర్వాత ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో ఉంచటంతో దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వీటిపై హైకోర్టులో ఇటీవల వాదనలు ముగియటంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ ప్రకటించారు. తాజాగా రెండు పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఈసీ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
జగన్‌పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan
గత ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసిన జనసేన ఈసారి కూడా అదే గుర్తుపై పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అయితే జనసేనను రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించిన ఈసీ గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ ఏప్రిల్ 2వ తేదీన జాబితా విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో గందరగోళం నెలకొంది.
ఎన్నికల వేళ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్ల విచారణ నేపథ్యంలో జనసేన పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. న్యాయస్థానం తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదనే ఆందోళనలో పార్టీ నేతలు ఉన్నారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పు పార్టీకి అనుకూలంగా రావటంతో జనసేనకు అతిపెద్ద టెన్షన్ తీరిపోయినట్లయింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం లభించినట్లయింది.