AP CM Chandrababu Distributed Pensions: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛను అందించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితిపైనా ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులు తమకున్న సమస్యలను సీఎంకు నివేదించగా వాటికి వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
మల్బరీ తోటలను పరిశీలించిన చంద్రబాబు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఆదరణ లేక సెరీకల్చర్‌లో నష్టపోయామని రైతులు వాపోయారు. ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మల్బరీ, వక్క రైతుల సమస్యలు అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. వక్క రైతుల సమస్యలు శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
అనంతరం గుండుమల గ్రామంలో ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రజావేదికలో లబ్ధిదారులతో మాట్లాడారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో కూటమి ద్వారా జవాబుదారీ పరిపాలన అందిస్తున్నామని అన్నారు. వితంతువులు, వృద్ధులు, వికలాంగులతో పాటు ఆదరువు లేని వారికి పింఛన్లు అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రాళ్ల సీమను రత్నాల సీమగా చేసే బాధ్యత తమదని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్న సీఎం, గత ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని నష్టాన్ని చూశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని, గత పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ఇష్టానుసారం దోపిడీ చేశారన్న సీఎం, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్లకు రూ.700 కోట్లు ఖర్చు చేసి ఫొటో పెట్టుకున్నారని, పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ రుషికొండలో ప్యాలెస్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డోలీ మోతలు కనిపించకూడదు - గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలపై సీఎం సమీక్ష - CM Review on Welfare Issues
గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్థానిక యువత వలసపోకుండా ఉపాథి కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.పేదలకు ఇళ్లు కట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు అన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి 4 లక్షలు ఇస్తామని తెలిపారు.
తాము పాలకులం కాదని, సేవకులమని గుర్తించాలన్నారు. వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్న సీఎం, ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో సాగునీటికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామన్న సీఎం, గత ఐదేళ్లలో రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కరవు జిల్లాలో కియా మోటార్స్ తీసుకువచ్చామని, అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు, జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తామన్నారు.
పోలవరం పూర్తిచేసి నదులు అనుసంధానిస్తే కరవు ఉండదని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు కృషిచేస్తామని, పేదరికం పోతే ఆర్థిక వెసులుబాటు వస్తుందన్నారు. అనంతపురం ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని, రిజర్వాయర్ల ద్వారా తాగు, నీరు సమస్య పరిష్కారమని హామీ ఇచ్చారు. అనంతపురం, మడకశిరలో ఏపీఐఐసీ వద్ద 1600 ఎకరాలు ఉందని, ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తామన్న సీఎం, యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తామని, ఇంటింటికీ కులాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగలి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తామని, అవకాశం ఉంటే మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY