Actor Suman on CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని సినీ నటుడు సుమన్ కొనియాడారు. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలంతా సహకరించాల్సిన సమయమని చెప్పారు. గతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారికి ఉద్యోగ కల్పన చేసేలా సీఎం చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు.
పవన్ తన సత్తా చూపిస్తున్నారు : అంతకుముందు సుమన్ తిరుపతిలోని శ్రీగొవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. సినీపరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సుమన్ తెలిపారు. రాష్ట్రంలో చిన్న చిన్న స్టూడియోలు నిర్మించేలా చూడాలన్నారు. సబ్జెక్ట్ తెలిసిన పవన్ కల్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సత్తా చూపిస్తున్నారని సుమన్ వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని సుమన్ పేర్కొన్నారు. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతమని చెప్పారు. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాసేవ చేస్తే పదవులు వాటికవే వస్తాయని సుమన్ వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొరవ చూపాలి. పవన్‌కు సినీ సమస్యలపై అవగాహన ఉండడం శుభసూచికం. పవన్‌కు సమస్యలపై అవగాహన ఉన్నందున త్వరగా పరిష్కారమవుతాయి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సత్తా చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉంది." - సుమన్, సినీ నటుడు
గతంలోనూ సుమన్ చంద్రబాబుపై ఆయనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురువని తెలిపారు. పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సుమన్ కూటమికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.