Prathidwani: 2019 ఎన్నికలకు ముందు జగన్, తనను సీఎం చేస్తే ప్రజలకు తాను ఏవేం పనులు చేస్తాననేది లిఖితపూర్వకంగా ఎన్నికల మేనిఫేస్టో రూపంలో విడుదల చేశారు. ఆ మ్యానిఫేస్టో చూసి జనం నిజమే అనుకున్నారు, ఓట్లేశారు, మోసపోయారు. మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు, 25 లక్షల ఇళ్లు, ధరల స్థిరీకరణ నిధి వంటి హామీలు పక్కన పెట్టేశారు.
అయినా నిస్సిగ్గుగా 2019 ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల్లో 99 శాతం పైగా హామీలు అమలు చేసేసాని జగన్ చెప్పుకుంటున్నారు. ప్రజలను మోసం చేసింది కాక, భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చటం అంటే వాటిని అవమానించటం కాదా? 2024 మేనిఫేస్టో విడుదల చేస్తూ, జగన్ చెప్పిన మాటలు వింటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది. మ్యానిఫేస్టోల పేరుతో ఎలా మోసం చేశారో నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. దీనిపై చర్చించేందుకు సామాజిక విశ్లేషకులు రాజా, రాజకీయ విశ్లేషకులు రాజేష్ ప్రతిధ్వని కార్యక్రమంలో పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జగన్ బాధిత సంఘంలో అగ్రస్థానంలో ఉన్నది దళిత వర్గాలే! - Dalith Voters in Andhra Pradesh
2019 మేనిఫెస్టోలో కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తామనీ గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యనిషేధం అని మాట మార్చి, దాన్ని కూడా అమలు చేయలేదు సరి కదా, ఊరుకి నాలుగైదు బెల్ట్‌షాప్‌లతో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు.
వైఎస్సార్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం, పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులూ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని 2019 మ్యానిఫెస్టోలో ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి రాగానే, మీ అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తునే అగమ్యగోచరంలోకి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో 72 శాతం పూర్తైన ప్రాజెక్టు పనుల్ని, ఈ అయిదేళ్లలో మరో అయిదారు శాతం మాత్రమే చేశారు. పైగా ఈ మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును వచ్చే అయిదేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు కానీ ఎప్పటికి అనే నిర్దేశిత సమయమంటూ చెప్పలేదు. గత అయిదేళ్లలో చేసింది అయిదారు శాతం పనులేనని మాత్రం చెప్పలేదు.
ఇక ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇంతే. పీఠం ఎక్కగానే తొలి దిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు కదా జగన్. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు. పార్లమెంటులో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే క్రమంలో కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి జగన్ బేషరతుగా మద్దతిచ్చారే తప్ప, ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తేలేదు.
సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చి జగన్, అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఉద్యోగుల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఎలక్షన్ సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సీపీఎస్ రద్దుపై మాట మార్చారు. జీపీఎస్ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు. దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించినా, మొండిగా చట్టం చేశారు.
మెగా డీఎస్సీ అన్న జగన్. అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఎన్నికల దృష్టిలో యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల 6 వేల 100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ కూడా వాయిదా పడింది. పైగా క్రమం తప్పకుండా గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు ప్రకటించి, నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల్ని మరోసారి వంచించేందుకు జగన్ సిద్ధమయ్యారు.
ముస్లింలకు జగన్ చేసిందేంటి ? - మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి ? - What CM Jagan did to minorities
2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమిచ్చాం. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా, ఎంఎస్‌ఎంఈలకు 2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు వచ్చాయని జగన్ గొప్పలు చెప్పారు. వాస్తవం చూస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్ష పేరుతో వారిపై వేధింపులకు పాల్పడింది. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూముల్ని వెనక్కు తీసుకుంది.
ఇవే కాకుండా వైఎస్సార్సీపీ మేనిఫోస్టోలో అంశాలను, టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పోలిస్తే ఏది ప్రజలకు ఎక్కువ లబ్ది చేస్తుంది? మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుంది అని జగన్ పాత పాటే పాడారు. మూడు ప్రాంతాల వాళ్లను ఒకరి మీదకు ఒకరిని ఎగదోసి రాజకీయంగా లాభం పొందుదామని చూసి జగన్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు ఏం అనుకుంటున్నారు? ఇలా పలు విషయాలపై వక్తలు మాట్లాడారు. ప్రతిధ్వని కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన లింక్‌పై క్లిక్ చేసి చూడండి.