WORLD FAMOUS CITIES : ప్రపంచంలో మీకు తెలిసిన అందమైన నగరం ఏదీ? అని అడిగితే.. ప్యారిస్ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ తర్వాత క్యోటో, వెనిస్ వంటి నగరాల పేర్లు చెప్తుంటారు. నిజానికి ఆయా నగరాలన్నీ అందమైనవే కానీ, అలాంటివి, అంతకు మించినవీ ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్ని నగరాలు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి అని బయటి ప్రపంచానికి తెలియదంటున్నారు ప్రపంచయాత్రికులు. ఆయా నగరాలు అంతగా జనాదరణ లభించకపోవడానికి ప్రచార లోపమే కారణమని చెప్తున్నారు. అత్యంత అందమైన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న ఐదు నగరాల గురించి తెలుసుకుందామా!
స్లోవేనియా రాజధాని లుబ్జానా నగరం
మనోహరమైన వాస్తుశిల్పంతో పాటు సజీవ సాంస్కృతిక దృశ్యాన్ని కలిగి ఉన్న సుందరమైన నగరం స్లోవేనియా రాజధాని లుబ్ల్జానా. ఈ నగరంలోని ఓల్డ్ సిటీలో ఇరుకైన వీధులు, అందమైన వంతెనలకు తోడు రంగురంగుల భవనాలతో పాదచారులకు అనుకూలమైన ప్రాంతం ఉంటుంది. ఐకానిక్ డ్రాగన్ బ్రిడ్జ్, ట్రిపుల్ బ్రిడ్జ్ ఈ నగరంలో చెప్పుకోదగిన ప్రాంతాలు. లుబ్ల్జానా కాజిల్ నగరంలో లష్ టివోలి పార్క్ పచ్చని ఒయాసిస్‌ను తలపిస్తుంది. సహజ సౌందర్యం కలిగిన ఈ ప్రాంతం నగరానికే వన్నె తెస్తుందంటున్నారు పర్యటకులు.
ఫ్రాన్స్‌లోని కోల్మార్
ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో దూరంగా ఉండే కోల్‌మార్ అందమైన నగరం. పారిస్ తర్వాత ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. మధ్యయుగ వాస్తుశిల్పం ఇక్కడ కనిపిస్తుంది. అందమైన, ఆకర్షణీయమైన పూల పొదల మధ్య ప్రవహించే కాలువలు పర్యాటకుల మది దోచుకుంటాయి. 'లిటిల్ వెనిస్' అని పిలుచుకునే కోల్మార్, కొబ్లెస్టోన్ వీధుల్లోని ఇళ్లకు వేసిన రంగులు ఇంద్రధనస్సు నేలకు వాలిందా అన్నట్లుగా కనిపిస్తాయి. గోతిక్ సెయింట్ మార్టిన్ చర్చి, అన్‌టర్‌లిండెన్ మ్యూజియం చూడదగిన ప్రాంతాలు. ఎంతో చారిత్రక నిర్మాణాలు పుణికిపుచ్చుకున్న కోల్మార్ నగరం ప్రశాంతత, సుందరమైన విహారయాత్ర కోరుకునే వారిని మంత్ర ముగ్ధులను చేస్తుందంటున్నారు ప్రకృతి ప్రేమికులు.
స్విట్జర్లాండ్‌లోని లూసర్న్
స్విట్జర్లాండ్ నడిబొడ్డున ఉన్న లూసర్న్ ప్రకృతి అందాల కలబోత. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, పక్కనే సరస్సు పర్యాటకులను మైమరపిస్తుంది. నగరానికి అన్ని వైపులా అందమైన దృశ్యాలు ప్రత్యేక లోకంలోకి ఆహ్వానిస్తాయి. చాపెల్ వంతెన, పూలతో అలంకరించిన 14వ శతాబ్దపు చెక్క వంతెన, వాటర్ టవర్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు. పాత పట్టణంలో చారిత్రాత్మక చర్చిలు, రంగురంగుల ఫ్రెస్కోడ్ భవనాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. లూసర్న్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తూ నగర అందాలను వీక్షించవచ్చు. సహజ అందాలకు తోడు నిర్మాణ సౌందర్యాల సమ్మేళనం లూసర్న్ నగరానికి అదనపు హంగులు అద్దుతున్నాయి.
పోర్చుగల్‌లోని పోర్టో
ఐరోపా ఖండంలో దాచిన రత్నంగా అభివర్ణించే నగరం పోర్టో. ఉత్తర పోర్చుగల్‌లోని డౌరో నది వెంట పోర్టో నగరం ఉంది. అందమైన దృశ్యాలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ పోర్టో నగరాన్ని గుర్తించింది. ఇరుకైన వీధులు, బరోక్ చర్చిలకు తోడు ఐకానిక్ డోమ్ లూయిస్ I వంతెన ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. రంగు రుంగల ఇళ్లు, నదీతీర కేఫ్‌లతో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. పోర్టో నగరం పోర్ట్ వైన్‌కు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడే ఉన్న విలా నోవా డి గియాలోని వైన్ సెల్లార్లను సందర్శించడం తప్పనిసరి. చారిత్రాత్మక వాస్తుశిల్పం, అద్భుతమైన వీక్షణలు, ఉల్లాసమైన సంస్కృతి పోర్టో నగరాన్ని ఐరోపాలో దాచిన రత్నంగా అభివర్ణిస్తున్నాయి.
వియత్నాంలోని హోయాన్
సెంట్రల్ వియత్నాంలోని తీరప్రాంత నగరమైన హోయాన్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం. నిర్మాణ శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. ఈ నగరంలోని వీధుల్లో పురాతన చెక్క ఇళ్లు అధికంగా ఆకట్టుకుంటాయి. క్యాండిల్ లైట్ వెలుతురులో కేఫ్‌లు, చారిత్రాత్మక దేవాలయాలు మనసు దోచుకుంటాయి. నదీతీరంలోని సెట్టింగులు, సమీపంలోని బీచ్‌లు హోయాన్ నగరానికి అదనపు హంగులు అద్దుతున్నాయి. నగరానికి ఉన్న చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాల సమ్మేళనం హోయాన్ ను ఆసియాలో అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలుపుతోంది.