Tirumala Garuda Seva: కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ - తిరుమల తిరుపతి దేవస్థానం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారు తన ప్రియ వాహనమైన గరుడ వాహనంపై ఆసీనులై భక్తులను ఆశీర్వదించారు. కొవిడ్ కారణంగా ఆలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు స్వామివారిని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి భక్తి సాగరంలో పులకించారు. గరుత్మంతుడు తన మాతృమూర్తిని దాస్యం నుంచి విముక్తి చేసిన వీరపుత్రుడు. జన్మనిచ్చిన తల్లి సేవ కోసం నిరంతరం శ్రమించిన గరుత్ముంతుడిని శ్రీ మహావిష్ణువు తన అనుంగు వాహనంగా చేసుకున్నారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వీక్షణం అత్యంత పవిత్రమని పురాణాలు చెబుతున్నాయి.