తల్లి ప్రేమను చాటి చెప్పిన ఏనుగు.. బిడ్డ మృతదేహాన్ని వీడలేక నరక యాతన - west bengal elephant
మనుషులైనా, జంతువులైనా ఏదీ అమ్మ ప్రేమకు సాటి రాదు. చనిపోయిన తన పిల్ల ఏనుగు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయిన తల్లి ఏనుగు.. దాన్ని వదలిపెట్టలేక పడిన యాతన హృదయాలను ద్రవింపజేసింది. పశ్చిమ బంగాల్లోని జల్పాయ్గుడి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లాలోని డూర్స్ ప్రాంతం తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. అక్కడి బనారహాత్ బ్లాక్‌లో ఉన్న చౌన్‌భాటి టీ ఎస్టేట్‌లో పిల్ల ఏనుగు చనిపోయింది. పిల్ల ఏనుగు మృతదేహాన్ని తీసుకుని తల్లి ఏనుగు దాన్ని ఒక టీ ఎస్టేట్ నుంచి మరొక టీఎస్టేట్‌కు తన మందతో కలిసి మోసుకు వెళ్లింది. ఏనుగు మందలో తల్లి ఏనుగుతో కలిపి మొత్తం 30 వరకు ఏనుగులు ఉండటంతో ఆయా టీ ఎస్టేట్‌లలో పనిచేసే కార్మికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు తల్లి ఏనుగు రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని ఒక పొద వద్ద పిల్ల ఏనుగు మృతదేహాన్ని ఉంచింది. ఏనుగుల మంద వల్ల స్థానికులకు హాని జరగకుండా ఏనుగుల మందను మళ్లించేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.