సిమెంట్ లారీ చోరీ.. దొంగకు తాలిబన్ స్టైల్లో శిక్ష.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. - లారీ దొంగ లేటెస్ట్ న్యూస్
సిమెంట్ లారీని దొంగతనం చేసిన ఓ యువకుడిని ఆ కంపెనీ ప్రతినిధులు, స్థానికులు తీవ్రంగా హింసించారు. తాలిబన్ స్టైల్లో కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. అనంతరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. మధ్యప్రదేశ్ షాహ్డోల్లో ఈ ఘటన జరిగింది. రస్తోగి ట్రేడర్స్ సమీపంలోని ఓ ట్రక్కును యువకుడు దొంగలించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ కంపెనీ ఉద్యోగులు దొంగను పట్టుకునేందుకు అతడిని వెంబడించారు. వారిని చూసి లారీని మరింత వేగంగా తీసుకెళ్లాడు దొంగ. ఫలితంగా లాల్పుర్ ఎయిర్పోర్ట్ సమీపంలో ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. అక్కడే ఉన్న కొంతమంది యువకుడిని పట్టుకున్నారు. అనంతరం స్థానికులు, కంపెనీ ఉద్యోగులు దొంగను చితకబాదారు. తీవ్రంగా హింసించి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. దొంగను కాపాడారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు హితవు పలికారు.