బంగారంతో భారీ గణపతి, 18 అడుగుల ఎత్తులో కాంతులీనుతూ
అందరూ ఎదురుచూస్తున్న మన గణేశుని పండుగ త్వరలో రానుంది. చవితి నాడు ఇళ్లలోనే కాదు వీధుల్లో దర్శనమిచ్చే వినాయకులను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. విభిన్నరకాల గణపతులను చూసే భక్తుల కోసం యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 18 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర లోహాలు ఉపయోగించి చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. కొవిడ్ ముందు ఇక్కడ భారీ ఎల్ఈడీ వినాయకుడు దర్శనమివ్వగా ఈ ఏడాది రానున్న స్వర్ణ గణేశుడిని స్వాగతించడానికి ఛందౌసీ వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.