ప్రాక్టీస్ సెషన్లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి
కబడ్డీ ప్రాక్టీస్ సెషన్లో ఉత్సాహంతో పల్టీలు కొట్టిన ఓ ప్లేయర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆగస్టు 8న అరణిలోని మరియమ్మన్ ఆలయ ఉత్సవం జరిగింది. అందులో భాగంగా కబడ్డీ పోటీల కోసం స్థానికంగా ఉన్న కె.ఎం.ఎస్ టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆ సమయంలో కబడ్డీ ప్లేయర్ వినోద్ కుమార్ ఒక్కసారిగా పల్టీలు కొట్టాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడ్ని అరణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అత్యవసర చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం వినోద్ మృతి చెందాడు. వినోద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.