వరిధాన్యం నీటిపాలు.. రైతు బతుకు కన్నీటిపాలు - తెలంగాణలో అకాల వర్షం
ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది. ఇవాళ ఉదయం కురిసిన భారీ వడగళ్లు.. కర్షకులకు కడగండ్లు మిగిల్చాయి. వేల ఎకరాల్లో పంట నేలరాలింది. లక్షల టన్నుల ధాన్యం నీట మునిగింది. ధాన్యపు రాశులన్నీ కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేని రైతు గుండెలవిసేలా రోదించాడు. తన కష్టమంతా అలా నీటిపాలవుతుంటే తట్టుకోలేక.. కన్నీరుమున్నీరయ్యాడు. నోటి కాడికి వస్తున్న కూడును లాగేసుకున్నట్టు.. ఇంకొన్ని రోజులైతే ధాన్యం అమ్ముడుపోయి పైసలు చేతికొస్తాయనుకున్న తరుణంలో ఆ వానదేవుడు తమ ఆశలను నీటిపాలు చేసి.. తన బతుకులను కన్నీటిపాలు చేశాడని విలపిస్తున్నారు.