గణేశుడికి ఒకేసారి 31వేల మంది మహిళల స్వరార్చన
ఒకేసారి 31వేల మంది మహిళలు.. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్రలో ఆవిష్కృతమైంది. పుణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రుషి పంచమిని పురస్కరించుకుని 31 వేల మంది మహిళలు వినాయక మండపం ఎదుట కూర్చుని గణపతికి ప్రీతకరమైన అథర్వణ శీర్ష స్తోత్రాన్ని పఠించారు. సంప్రదాయ వేషధారణలో వచ్చిన మహిళలతో ఆ ప్రాంగణమంతా కళకళలాడింది. ఈ ఆనవాయితీ 35 ఏళ్ల నుంచి కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొవిడ్ సంక్షోభం వల్ల గత రెండేళ్లు.. కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఈసారి అద్భుతంగా జరిగిందని తెలిపారు. ముంబయిలోని లాల్ బాగ్చా రాజా గణేశుడి మాదిరిగానే పుణెలోని దగ్దుషేత్ హల్వాయి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి.