గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్ చేసి రక్షించిన సిబ్బంది - థాయిలాండ్ న్యూస్
థాయ్‌లాండ్ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన తల్లి ఏనుగు.. మరింత ఆందోళనకు గురైంది. రెస్క్యూ ఆపరేషన్‌ను అడ్డగించింది. దీంతో సిబ్బంది.. ట్రాంక్విలైజర్‌లు ఉపయోగించారు. స్పృహ కోల్పోయిన తల్లి ఏనుగు సైతం కొద్దిగా గుంతలోకి జారింది. దానికి తాళ్లు కట్టి.. క్రేన్ సాయంతో బయటకు లాగారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఏనుగుపైకి కొంతమంది ఎక్కి సీపీఆర్(కార్డియోపల్మనరీ రెసస్కిటేషన్) చికిత్స చేశారు. అప్పటికే పిల్ల ఏనుగు బయటకు వచ్చేందుకు వీలుగా గుంతను తవ్వారు. చివరకు అది బయటకు వచ్చింది. మరోవైపు తల్లి ఏనుగు కూడా స్పృహలోకి వచ్చింది. అనంతరం ఆ రెండు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.