వేదికపైనే వరుడి చెంప పగలగొట్టిన వధువు.. కారణమిదే... - పెళ్లి వేదికపైనే వరుడిపై దాడి
Bride slaps groom during wedding: వివాహ వేదికపైనే వరుడి చెంప పగలగొట్టింది వధువు. ఆ తర్వాత కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమిర్‌పుర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. లాల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాసా బుజుర్గ్ గ్రామానికి చెందిన మనోహర్ అహిర్వార్ కూతురికి.. జలౌన్ జిల్లా, ఆటా పోలీస్ స్టేషన్ పరిధిలోని చమారీ గ్రామానికి చెందిన రవికాంత్ అహిర్వార్‌తో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం రాత్రి పెళ్లి బరాత్ వధువు ఇంటికి చేరుకుంది. వారికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో భాగంగా మాలధారణ ఉంటుంది. అయితే.. వధువు అందుకు సిద్ధం కాకముందే వరుడు ఆమె మెడలో మాల వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన వధువు.. వరుడి చెంపపై పలుమార్లు కొట్టింది. దీంతో వేదికపై గందరగోళం నెలకొంది. ఆ తర్వాత వేదిక దిగి వెళ్లిపోయింది వధువు. ఇరువురిని సముదాయించేందుకు రెండు కుటుంబాల వారు ప్రయత్నించినా ఆ రాత్రికి సాధ్యపడలేదు. రెండు కుటుంబాల అంగీకారంతో సోమవారం ఉదయం పెళ్లి పనులు మొదలు పెట్టారు. వధూవరులు శాంతించి, అంగీకారం తెలపగా వివాహ తంతు పూర్తి చేశారని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని పోలీసులు తెలిపారు.