ముత్యాల సవ్వడులు... బొగత అందాల పరవళ్లు చూశారా..!
రుతుపవనాల ప్రభావంతో.. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీనితో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలోని.. అటవీ ప్రాంతంలోని ముత్యల జలపాతం.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలనురగల్లాంటి జలధారలు కొండపై నుంచి కిందకు పరుగులు పెడుతూ మనోహరంగా నిలుస్తున్నాయి. జలధారల సవ్వడులతో.. అటవీ ప్రాంతం మారుమ్రోగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో నెలకొన్న.. తెలంగాణ నయగరా బొగత జలపాతం కూడా.. జోరుగా ప్రవహిస్తోంది. గత 2 రోజులుగా ములుగు, ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు పడుతుండటం వల్ల బొగత కొత్త అందాలు తెచ్చుకుంది. కొండకోనల్లో నుంచి వడివడిగా.. పరుగులు తీస్తున్న జలధారలు.. కన్నార్పకుండా చేస్తున్నాయి. సందర్శకులు అక్కడి జలకళను చూసి మురిసిపోతున్నారు.