పెట్రోల్ బంక్‌లో పట్టపగలే దారుణం, మహిళపై కత్తితో దాడి, వెంటాడి మరీ - maharastra news
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. పాథర్డీ గ్రామ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న జుబేదా అనే మహిళపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు పరిగెత్తినా.. వెంటపడి మరీ గాయపరిచాడు. అనంతరం స్థానికులు అతడ్ని చుట్టుముట్టగా ఘటనాస్థలి నుంచి పారిపోయి తప్పించుకున్నాడు. నిందితుడ్ని ప్రమోద్ గోసావిగా పోలీసులు గుర్తించారు. అయితే తీవ్రంగా గాయపడిన జుబేదాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే వీరిద్దరు కొన్నినెలల పాటు ప్రేమించుకున్నారని, తాజాగా విడిపోయారని పోలీసులు చెప్పారు. ఆ కోపంతోనే నిందితుడు దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోవైపు, తమిళనాడులోని చెన్నైకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌పై రైలులో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. రైలులోని మహిళల కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు ఆ వ్యక్తి. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆశీర్వా.. అతడ్ని వేరే బోగీలోకి వెళ్లమని తెలిపింది. వెంటనే అతడు కత్తి తీసి ఆమె ఛాతీ, మెడపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఆమె కదులుతున్న రైలు నుంచి దూకింది. గమనించిన రైల్వే ఉద్యోగులు.. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.