బ్రష్ చేసుకుంటూ బావిలో పడ్డ వృద్ధుడు.. కానీ లక్కీగా! - ఒడిశా 75 ఏళ్ల మనిషి
75 year old man Rescued From Well: ప్రమాదవశాత్తు బావిలో పడిన ఓ 75 ఏళ్ల వృద్ధుడిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో జరిగింది. జైపుర్ బ్లాక్ పరిధిలోని ఉమ్రి గ్రామానికి చెందిన రూపధర్ హల్వా అనే వ్యక్తి మంగళవారం ఉదయం బావి వద్దకు వెళ్లాడు. అక్కడ నిల్చొని పళ్లు తోముకుంటుండగా, అధిక రక్తపోటు కారణంగా తల ఊగి లోతైన బావిలో పడిపోయినట్లు సమాచారం. తరువాత, కొంతమంది గ్రామస్థులు అతడు బావిలో సహాయం కోసం కేకలు వేయడం గమనించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని నిచ్చెన సహాయంతో బావిలోంచి 75 ఏళ్ల హల్వాను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.