రాశిఫలం: వృషభం - శార్వారినామ సంవత్సరంలో
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1 మీ జీవిత భాగస్వామి పేరు మీద గతంలో కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. వచ్చిన డబ్బుతో కమర్షియల్ ఏరియాలో విలువైన షాపు లేదా స్థలం కొంటారు. వేరేచోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని.. మీ నుంచి వివరణ అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. మీరు లౌక్యంగా ప్రతిఘటించి.. వాస్తవాలను మీరే నిరూపిస్తారు. తాత్కాలిక వ్యాపారాలు కలిసివచ్చినా... కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. చార్టెడ్ అకౌంటెంట్స్కి ఈ ఏడాది బాగుంది. ఈ రాశివారు వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు విసుగుపుట్టిస్తాయి. దైవానుగ్రహంతో మీ ప్రమేయం లేకుండానే మంచి సంబంధం దొరుకుతుంది. పది రూపాయల ఖర్చయ్యే చోట 20 రూపాయలు ఖర్చు చేసి శుభకార్యాలు ఘనంగా చేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. మీ పలుకుబడిని ఉపయోగించి.. ప్రభుత్వపరంగా మంచి ఆర్డర్లు తీసుకొస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకొగలుగుతారు. సంవత్సర ద్వితీయార్ధంలో రెండు నెలలు వృత్తి, ఉద్యోగ పరంగా సంతృప్తిగా ఉండదు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. లాభాలుంటాయి. భాగస్వామితో వ్యాపారం చేసే కంటే.. నాలుగు గేదెలు పెట్టుకుంటే మంచిదని మీ ఇంట్లో వాళ్లు సలహాలిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు ఎదురుకావు. ఉద్యోగంలో స్థాన చలనం తప్పకపోవచ్చు. అయినా మీ ఉనికి కాపాడుకుంటారు. కుటుంబం, బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను ఈ రాశి వారు పరిష్కరించగలుగుతారు.
Last Updated : Mar 25, 2020, 11:12 AM IST