'గేమ్స్ ఆడటం వల్ల పిల్లలకు నాయకత్వ లక్షణాలు, గెలుపోటములు ఎలా స్వీకరించాలో తెలుస్తాయి' - acchampet zonal level sports
Published : Dec 14, 2023, 8:03 PM IST
Zonal Level Sports at Nagarkurnool District :నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను ఎలా స్వీకరించాలో తెలుస్తాయని ఉదయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇలాంటి ఆటల్లో పాలు పంచుకునే అదృష్టం ఉంటుందని, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ కూడా ఇలాంటి క్రీడలను నిర్వహించే వాతావరణం ఉండదని తెలిపారు.
ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ పిల్లలు మైదానంలో ఆడుకోకుండా సెల్ఫోన్లు వాడుతున్నారని, వాటి వల్ల పిల్లలకు శారీరక శ్రమ లేకుండా పోతుందని చెప్పారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లల మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినేనని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నైపుణ్యాన్ని కనబరిచి విజయం సాధించాలని పేర్కొన్నారు.