YSRCP MPTC Harassment: అధికార పార్టీ ఎంపీటీసీ వేధింపులు.. అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం - Dalit Anganwadi worker Suicide attempt
YSRCP MPTC Harassment Anganwadi worker suicide attempted: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా అధికార పార్టీకి చెందిన నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. పార్టీ అండదండలను చూసుకుని దళితులను ఇష్టారీతిగా వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం గురివిందగుంటలో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్న ఓ దళిత మహిళను.. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఎంపీటీసీ వేధింపులు తట్టుకోలేక అంగన్‌వాడీ కార్యకర్త సూసైడ్ ప్రయత్నం.. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం గురివిందగుంటలో గత ఇరవై ఏళ్లుగా దళిత వర్గానికి చెందిన అన్నపూర్ణ అనే మహిళ అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామ ఎంపీటీసీ.. తన (అన్నపూర్ణ)పై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ తరచూ వేధిస్తున్నారని, అందుకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆమె ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తన మరణానికి గ్రామ ఎంపీటీసీ వేమూరి మోహన్, వైసీపీ నేత జోజిబాబులే కారణమని పేర్కొంటూ.. ఎలుకల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు.. హూటాహుటిన విజయవాడ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఎంపీటీసీ నుంచి ప్రాణహాని ఉంది-కాపాడండి.. ''మా అమ్మ గురువిందగుంటలో గత 20ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. అదే అంగన్వాడీలో హెల్పర్‌గా చేస్తున్న ఓ మహిళను టీచరుగా చేసేందుకే.. మా అమ్మపై గ్రామ ఎంపీటీసీ, మరొక వైసీపీ నేత లేనిపోని ఆరోపణలు చేస్తూ.. సమస్యలు సృష్టిస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ తరచూ వేధిస్తున్నారు. దయచేసి పోలీసులు స్పందించి.. ఎంపీటీసీ నుంచి మా అమ్మకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను.'' అని బాధితురాలి కుమార్తె కళ్యాణి అన్నారు.