YS Sharmila : లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల - sharmila house arrest video
YS Sharmila Slaps Police in Hyderabad : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈనెల 26న నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్కు దగ్గర అఖిలపక్ష నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో విపక్షాల మద్దతు కూడగట్టేందుకు షర్మిల చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లోటస్‌పాండ్ నుంచి బయలుదేరిన షర్మిలను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అడ్డుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ లోటస్‌పాండ్ వద్ద రహదారిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ షర్మిల చేశారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్ భయపడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకూ కోర్టు అనుమతి పొందాలా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పీఎస్‌లో ఉన్న షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ అక్కడికి చేరుకున్నారు.
"ఒంటరిగానే సిట్ కార్యాలయానికి వెళ్తుంటే అడ్డుకున్నారు. పేపర్ లీకేజ్ దర్యాప్తుపై వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నాను. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను ధర్నాకు పోలేదు, ముట్టడికి పిలుపు ఇవ్వలేదు. నా ఇంటిచుట్టూ వందలాది పోలీసుల పహారా ఎందుకు?. పోలీసులే నాపట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు మీద పడుతుంటే భరించాలా?. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు?. నా రక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత." -వైఎస్ షర్మిల,వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు