కాంగ్రెస్ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పజెప్పినా నమ్మకంగా పని చేస్తా : షర్మిల - YS Sharmila In hyderabad
Published : Jan 6, 2024, 12:43 PM IST
YS Sharmila Returned To Hyderabad :దిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిల తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి బాధ్యత అప్పజెప్పినా స్వీకరించి నమ్మకంగా పనిచేస్తానని షర్మిల తెలిపారు. దిల్లీ పర్యటన విజవంతంగా సాగినట్టు ఆమె చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇందుకోసం బుధవారం రాత్రే షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల దిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్లు సమాచారం.