Sharmila On TSPSC Paper Leak : 'సిట్ దర్యాప్తు స్క్రిప్ట్ మొత్తం ప్రగతిభవన్ నుంచే' - తెలంగాణ వార్తలు
YS Sharmila Complaint On TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు చేస్తున్న దానికి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ప్రగతిభవన్ నుంచే వస్తుందన్నారు. దోషులు ఎవరన్నది కూడా ప్రగతి భవనే నిర్ణయిస్తోందంటూ షర్మిల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగంలోని అన్ని కార్యాలయాల్లోని కంప్యూటర్ల భద్రత బాధ్యత ఐటీ శాఖదేనన్నారు. ఐపీ, పాస్‌వర్డ్ తెలిసినంత మాత్రాన ఎవరైనా ఏ సమాచారం అయినా పొందటం అంత సులభమా అని ప్రశ్నించారు.
ఐపీ అడ్రస్, పాస్‌వర్డ్ ఉంటే ఏ సమాచారమైనా తెలుసుకోవచ్చా: రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి భద్రత విషయమైనా కేవలం ఐపీ అడ్రస్, పాస్‌వర్డ్ ఉంటే తెలుసుకోవచ్చా అని షర్మిల ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలోని కంప్యూటర్లకు సంబంధించిన ఆడిటింగ్ వివరాలను బయటపెట్టాలన్నారు. ఇది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఐటీ శాఖ మంత్రి చెప్పటం హాస్యాస్పదమన్నారు.