పోలీసులు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల
YS Sharmila Fell Down: ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి.. అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలనుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అక్కడ జరిగిన తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. వెంటనే పోలీసులు ఆమెను పైకి లేపారు. పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల తన ఇంటి వద్ద ధర్నాకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ నియంత అని మరోసారి నిరూపణ అయ్యిందన్న ఆమె.. కేసీఆర్ తాను ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలనుకున్నామన‌్న షర్మిల.. ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను గృహ నిర్బంధం చేసినట్లు గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద రూ.200 కోట్లతో టవర్స్ కడతామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజల పక్షాల పోరాటం చేసే పరిస్థితి లేదని.. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్‌లు చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణలో జరుగుతున్న అంశాలపై దృష్టి పెట్టాలంటూ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.