'మా భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడికే ఓటేస్తాం' - యూత్ ఓటర్ల ఇంటర్వ్యూ
Published : Nov 7, 2023, 6:34 AM IST
Youth Voters Interview on Assembly Elections 2023 : ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే సరైన నాయకుడు పాలకునిగా ఎన్నికైవుతాడు. ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవచ్చు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు, చైతన్యంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో యువ ఓటర్లకు అవగాహన కల్పించింది. దీంతో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటుహక్కుకు నివేదికలు సమర్పించి సమాజంలో ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు సమాజంలో కళ్ల ముందు జరుగుతున్న అవినీతిని అరికట్టే అవకాశం లేకపోయిందే అనుకున్న యువకులకు సరికొత్త అవకాశం వచ్చేసింది. తమ నాయకుడిగా ఉండాలి అనే వ్యక్తిని గెలిపించుకునే రోజు ముందుంది.
Telangana Young Voters Interview :విలువలతో కూడిన నాయకునికే తమ అమూల్యమైన ఓటును వేసి తమ లక్ష్యాన్ని చేరతామని యువ ఓటర్లు చెబుతున్నారు. అధికారమే లక్ష్యంగా రాజకీయ నేతలు చేస్తున్న కుయూక్తులకు ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు. మీరు వేసే ప్రతి ఓటు మీ పిల్లల భవిష్యత్, ముందు తరాల తలరాతలకు మార్గనిర్దేశాలుగా ఉండాలని అంటున్నారు. తాయిలాలను దూరం చేసి, చిత్తశుద్ధితో పనిచేసేవారికి పట్టం కడదామని యువ ఓటర్లు చెబుతున్నారు.నిజాయితీ గల అభ్యర్థి, ఆయా పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలు, ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే పదవీకాలంలో చేయబోయే పనులేంటి..? ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటేస్తామని ధీమాగా చెబుతున్నారు యువ ఓటర్లు. తమ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటును వేస్తామని.. ఓటు అస్త్రంగానే కాకుండా తమ బాగోగులు మార్చే హక్కును బాధ్యతాయుతంగా వేస్తామంటున్నారు.