Burning Vehicle Pending Traffic Challan : పెండింగ్ ట్రాఫిక్ చలానా కట్టమన్నందుకు.. ఏకంగా బైక్‌కే నిప్పు
Young Man Set His Bike On Fire Paying Pending Traffic challan : పెండింగ్‌లో ఉన్న బైక్ చలానా కట్టమన్నందుకు ఏకంగా తన బైక్‌కే నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాంగ్ రూట్‌లో వస్తున్న ఫసియుద్దీన్ అనే యువకుడు హెల్మెట్ లేకుండా వెళుతున్నాడు. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని ఆపి పెండింగ్ చలాన్లు చెక్ చేశారు. ఆ చలాన్లను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు.
ఎందుకంటే ఆ బైక్‌పై ఏకంగా రూ.28,000ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. దీనితో యువకుడిని పోలీసులు ఆ పెనాల్టీ కట్టాలని కోరారు. అయితే ఒక్కసారిగా సీరియస్ అయిన ఫసియుద్దీన్.. తన యాక్టివా తాళాలు తీసుకుంటున్న పోలీసులపై విరుచుకుపడ్డాడు. చలాన్లు కట్టనంటూ ఏకంగా బండి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి.. అందులో అగ్నిపుల్ల ముట్టించి నిప్పంటించాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి.. మంటను ఆర్పేశారు. ఆయువకుడిని అదుపులోకి తీసుకొని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.