'రైతులు, పేదల సంక్షేమం గురించి ఆలోచించేది బీజేపీ మాత్రమే'
Published : Nov 25, 2023, 3:51 PM IST
Yogi Adityanath Election Campaign in Sirpur :ఎన్నికల పోరు తుది దశకు చేరుకోవడంతో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుసకడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొంటూ.. ఎన్నికల హోరును మరింత రక్తికట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని పాటించవని యోగి విమర్శించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు నిజమైన గౌరవం కల్పించింది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు.
రైతులు, పేదల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. దేశ ప్రజలందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయటం.. ఆ విపత్కర సమయంలో దేశమంతటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చిన ఘనత మోదీ సర్కారుదే అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. అయోధ్యలో రామమందిరం నిర్మించి ఉండేదా అంటూ ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభమౌతోందని.. దర్శనానికి తెలంగాణ ప్రజలు తరలిరావాలని ప్రజలకు యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.