Yadadri devotees Problems : పొంచి ఉన్న ప్రమాదం.. శిథిలావస్థలో యాదాద్రి మొదటి కమాన్ పిల్లర్ - Yadadri devotees Problems
Yadadri first arch pillar in ruins : యాదగిరి గుట్ట పట్టణం నుంచి శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో మొదటి కమాన్ కుడి వైపు పిల్లర్ శిథిలావస్థలో ఉంది. పిల్లర్ బీటలు వారి ఉండటంతో ఎప్పుడు ఏమవుతుందనే భయంతో దుకాణదారులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పురాతన కమాన్ ఉండటంతో పాటు గాలులు, వర్షాలు నేపథ్యంలో ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి. పాత గుట్టకు వెళ్లే భక్తులు ఆటోలు, కార్లు, గుర్రపు బగ్గీలతో నిత్యం ఈ దారి నుంచే ప్రయాణం సాగిస్తుంటారు. ఈ కమాన్ మార్గం నుంచే మరి కొన్ని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కమాన్ పిల్లర్ పూర్తిగా బీటలు చెంది అప్పుడో, ఇప్పుడో అన్నట్లుగా ఉంది. దీంతో స్థానికులు ఈ మార్గం ద్వారా ప్రయాణించాలంటనే భయపడిపోతున్నారు. ఈ కమాన్ నిర్మాణం 1-1-1975వ సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన స్వామి వారి భక్తులు శ్రీ పొట్ట లక్ష్మయ్య యాదవ్, శ్రీమతి గండెమ్మ దంపతులు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని నిర్మించి సుమారు 48 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చెందింది. ప్రమాదం జరగక మునుపే ఆలయ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని భక్తులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.