తగ్గేదేలే.. చీరకట్టులో ఫుట్బాల్ ఆడిన మహిళలు - చీరకట్టులో సాకర్ ఆడిన మహిళలు
ఫుట్బాల్.. చీరకట్టులో ఆడే ఆట కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి వారి ఆలోచనల్ని పటాపంచలు చేశారు కొందరు మహిళలు. చీరకట్టులో ఫుట్బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాలితో బంతిని అలవోకగా తన్ని.. ఏ వస్త్రధారణలోనైనా ఫుట్బాల్ ఆడవచ్చని నిరూపించారు. గోల్ కొట్టేందుకు చకచక పరుగులు తీస్తూ.. అదరగొట్టారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. బంతిని గోల్ దిశగా పరుగెత్తించారు. ఈ అరుదైన ఘటనకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వేదికైంది. నగరంలోని ఎమ్ఎల్బీ గ్రౌండ్లో స్థానికులు 'గోల్ ఇన్ శారీ' అనే టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. అయితే, ఇందులో పాల్గొన్న వారు 25 నుంచి 50 ఏళ్ల వయసువారే. రెండు రోజులు జరిగే ఈ టోర్నమెంట్లో.. మొదటి రోజు పింక్, నీలం, కాషాయ రంగు జట్లు పాల్గొన్నాయి. ఇందులో పింక్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీని నిర్వహించిన కన్వీనర్ అంజలి బాత్రా మాట్లాడుతూ.. మహిళలు చీరకట్టులో ఫుట్బాల్ ఆడటం చూసి ప్రేక్షకులు థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారని తెలిపారు.