వాళ్లకు డబ్బులిచ్చి మాకెందుకు ఇవ్వలేదు - 'పంచాయితీ'కి చేరిన మహిళల ఆందోళన - ఓటు వేశాం మాకు డబ్బులు కావాలంటూ మహిళల గొడవ
Published : Dec 1, 2023, 7:14 PM IST
Women Fight For Money in Telangana Elections : ఓటు వేసినందుకు తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ మహిళలు పంచాయితీకి దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల పోలింగ్ ముందు రోజు రాత్రి కొందరు నాయకులు డబ్బులు పంచారు. పెద్దనక్కలపేటలో 40 మహిళా సంఘాలు ఉంటే కేవలం 8 సంఘాల వారికే పంచారు. మిగతా వారికి డబ్బులు అందకపోవడంతో వారంతా కలిసి అధ్యక్షురాలి ఇంటికి వెళ్లారు.
ఇంటి మీదకు ఎందుకు వస్తున్నారని ఆమె అనడంతో మహిళలంతా కలిసి గ్రామ పంచాయతీకి ఆమెను పిలిపించారు. గ్రామంలో 40 మహిళా సంఘాలు ఉంటే కేవలం ఎనిమిది సంఘాలకు మాత్రమే ఎలా పంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి అధ్యక్షురాలితో వ్యాగ్వాదానికి దిగారు. తాము కూడా ఓటర్లమే కదా, ఎందుకు అందరికీ ఇవ్వలేదని ఆమెను ప్రశ్నించారు. ఇస్తే అందరికీ ఇవ్వాలని, లేకపోతే ఎవ్వరికీ ఇవ్వకూడదని పంచాయితీకి దిగారు. దీంతో అధ్యక్షురాలు అందరికీ ఇస్తామని చెప్పడంతో వారందరూ ఇంటి బాటపట్టారు.