రన్నింగ్ బస్ నుంచి జారిపడ్డ యువతి.. అక్కడికక్కడే మృతి.. లైవ్ వీడియో - సేలంలో బస్సు ప్రమాదం తాజా వార్తలు
కదులుతున్న బస్సు నుంచి జారిపడిన ఓ యువతి.. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని వెన్నండూర్ ప్రాంతానికి చెందిన గోపాల్ కుమార్తె కౌసల్య(20) రెండు నెలల క్రితమే మల్లసముద్రంలోని ఓ వస్త్రాల దుకాణంలో పనిలో చేరింది. అందుకోసం ఆమె రోజూ బస్సులో ప్రయాణించి వెళ్లేది. రోజూలాగానే మే 3న కూడా పనికి వెళ్లింది. సాయంత్రం తన చెల్లితో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఈరోడ్‌లో బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సు కిక్కిరిసి ఉండడం వల్ల చెల్లిని అక్కడే ఉన్న తోటి ప్రయాణికురాలికి అప్పజెప్పింది.
బస్సులో రద్దీ కారణంగా ఆమె ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అత్తయ్యంబట్టి బస్టాండ్ సమీపంలోకి బస్సు రాగానే ప్రమాదవశాత్తు ఒక్కసారిగా జారి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి వెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అత్తయ్యంబట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.