యువకులకు చుక్కలు చూపించిన ఏనుగు.. సెల్ఫీ కోసం వెళ్తే ఛేజ్ చేసి.. - అడవి ఏనుగుల దాడి వీడియో
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులు హల్చల్ చేశాయి. సెల్ఫీ కోసం దగ్గరగా వచ్చిన కొందరిపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. లఖీంపుర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈ ఏనుగుల గుంపు నేపాల్ నుంచి దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఇదే అడవుల్లో ఏనుగులు కొద్ది రోజులుగా సంచరిస్తున్నాయని వారు వెల్లడించారు.
కాగా మంగళవారం సాయంత్రం గౌరీఫాంట రోడ్ మీదకు ఈ ఏనుగుల గుంపు వచ్చింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ముగ్గురు వ్యక్తులు.. వీటిని గమనించారు. అనంతరం ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు వాటికి దగ్గరగా వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏనుగుల గుంపు యువకుల వెంట పడ్డాయి. దీంతో వాటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు.. పరుగు ప్రారంభించారు ఆ ముగ్గురు వ్యక్తులు. అయినా వారిని విడిచిపెట్టని ఏనుగులు.. కాస్త దూరం ఆ వ్యక్తులను తరిమాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.