మిషన్ భగీరథకు లీకేజీ సమస్యలు.. జనానికి 'నీటి' సమస్యలు - వరంగల్ మిషన్ భగీరథలో పైపులైన్ నుంచి నీటి లీకేజీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. ప్రజలందరికీ తాగునీటి సమస్య లేకుండా చూడటానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు ఈ పథకం వల్ల తాగునీటి సమస్య నుంచి బయటపడ్డారు. అయితే ప్రస్తుతం కొన్ని చోట్ల నీటి పంపిణీ పైపులకు అంతరాయం ఏర్పడుతుంది. వాటర్ పైపులను లీకేజీ సమస్యలు వెంటాడుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం 365 జాతీయ రహదారి పక్క నుంచి ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ లీక్ అయ్యింది. దీనివల్ల నీరు ఏరులై పారింది. పెద్దఎత్తున తాగునీరు వృథాగా పోయింది. రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పైపుల లీకేజీ సమస్య తరచూ సంభవించడంతో నీరు వృథాగా పోవడమే కాక రవాణా వ్యవస్థ స్తంభించడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పైపులు మరమ్మతులు అయ్యేంత వరకు నీటి సప్లై ఆగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు లీకేజీ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.