నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోతలు మళ్లీ షురూ - గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు ప్రారంభం
Nandi Pumphouse lifts water : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గోదావరి నదీ జలాల ఎత్తిపోతలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల నుంచి సుమారు 19 వేల క్యూసెక్కుల జలాలు ఎత్తిపోస్తున్నారు. రాత్రి వేళ ప్రాజెక్ట్ మొదటి, రెండో దశల్లోని పంప్‌హౌస్‌లలో ఎక్కువ మోటార్లను నడుపుతున్నారు.
Gayatri Pumphouse lifts water : ఈ గోదావరి జలాలను మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట, మెదక్, సూర్యాపేట జిల్లాలకు గోదావరి నదీ జలాల తరలింపునకు నీటి పారుదల శాఖ చర్యలు చేపట్టింది. నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ గోదావరి జలాల ఎత్తిపోత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
గత నెలలో ఆ మూడు పంపుల నుంచి ఎత్తిపోతలు..: మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పథకంలోని మూడు పంపుహౌస్‌ల నుంచి సైతం గత నెలలో ఎగువకు ఎత్తిపోతలను తిరిగి ప్రారంభించారు. గతేడాది జులైలో గోదావరికి భారీ వరదలు రావడంతో లక్ష్మి, సరస్వతి పంపుహౌస్‌లలోని 12 పంపులు నీట మునిగాయి.
వాటికి మరమ్మతులు చేసిన అనంతరం కొద్దిరోజుల కిందట ట్రయల్ రన్ నిర్వహించారు. సజావుగా నడవడంతో లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌ల నుంచి రెండు మోటార్ల చొప్పున నడిపిస్తూ శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి ఎత్తిపోతలు ప్రారంభించారు. లక్ష్మి పంప్‌హౌస్‌లో 1, 2 మోటార్లను నడిపించారు. పంపుహౌస్‌ల నుంచి మొదట ఎల్లంపల్లి జలాశయానికి, అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించినట్లు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. రాత్రి 10 నుంచి వేకువజామున 4 గంటల వరకు ఎత్తిపోతలను కొనసాగించినట్లు వివరించారు.