Viveka Murder Case Updates వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు .. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు! - భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్
Published : Sep 20, 2023, 7:31 PM IST
Viveka Murder case Updates Bhaskar reddy bail : వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. సీబీఐ కోర్టు అయనకు 12 రోజులపాటు ఎస్కార్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. తాను అనారోగ్యంగా ఉన్నందున 15రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. చంచల్‌గూడ జైలు అధికారులు అయన హెల్త్ రిపోర్టును నిన్న సీబీఐ కోర్టుకు సమర్పించారు. హెల్త్ రిపోర్టును పరిశీలించిన సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఎస్కార్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్గూడా జైలు అధికారులు ముగ్గురు పోలీసులను వైయస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ గా పంపించనున్నారు. ముగ్గురు పోలీస్ సిబ్బంది కూడా 12 రోజులపాటు వైయస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్టుగా ఉండనున్నారు. 12 రోజులపాటు ఎస్కార్ట్ కు అయ్యే వ్యయాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి భరించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి... ప్రస్తుతం అయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది.