'తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్రనే నా ఆస్తి' - పొన్నం ప్రభాకర్ వైరల్ వీడియో
Published : Nov 6, 2023, 7:52 PM IST
Viral Video of Ponnam Prabhakar Vehicle Checking Incident :హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎన్నికల నిబంధనల్లో భాగంగా వాహనాల తనిఖీల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని.. సైదాపూర్ వెళ్తున్న క్రమంలో ఎన్నికల కోడ్ సిబ్బంది ఆయన వాహనాన్ని ఆపారు. వాహనం తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న సూట్ కేసును గమనించిన పోలీసు సిబ్బంది అదేమిటని పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో "ఇది నా ఆస్తి, చూపించమంటారా" అని ఆ సూట్ కేసును పొన్నం ప్రభాకర్ తెరచి చూపించారు.
ఆ సూట్ కేసులో తెలంగాణ ఉద్యమ చరిత్ర, పార్లమెంటులో పొన్నం పెప్పర్ స్ప్రే దాడికి గురైనప్పటి దృశ్యాలు, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా పలువురు పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయిన చిత్రాలు కనిపించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్రనే, తన ఆస్తి అని.. తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడానని పొన్నం వివరించారు. ఈ దృశ్యాలన్ని అక్కడ ఉన్నవారంత ఆసక్తిగా చూశారు. ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.