Viral Video : వాగు దాటేందుకు ప్రయత్నించాడు.. సగం దూరం వెళ్లాక కొట్టుకుపోయాడు.. లక్కీగా.. - vikarabad latest news
Man Fell into the Stream in Vikarabad : వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల వాగు భారీగా ప్రవహిస్తున్న సందర్భంగా వాగు దాటే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి అందులోనే పడిపోయాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి వెంటనే వాగులోకి దూకి ఆ వ్యక్తిని కాపాడాడు. ఈ వాగు వల్ల ప్రజలు ఎటూ పోలేని పరిస్థితిలో ఉన్నారని.. ఎన్ని ధర్నాలు, ఉద్యమాలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోయారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ దోర్నాల్ బ్రిడ్జి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని.. ఈ నిర్లక్ష్యం ఎవరిదని, దీనికి బాధ్యులు ఎవరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వాగులో మనుషులు కొట్టుకోపోతున్నా.. ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరికీ పట్టింపు లేదని మండిపడ్డారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. వారి కుటుంబాలతో పాటు వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది.