Viral Video Electricity Restoration by Swimming in Pond : విద్యుత్ ఉద్యోగుల సాహసం.. చెరువులో ఈదుకుంటూ వెళ్లి 11 కేవీలైన్ విద్యుత్ పునరుద్ధరణ - Electricity restoration swimming pond video viral
Published : Sep 3, 2023, 1:15 PM IST
Viral Video Electricity Restoration by Swimming in Pond : చుట్టూ నీరు.. మధ్యలో కరెంట్ స్తంభం.. విద్యుత్ పునరుద్ధరణ కోసం ఎలక్ట్రిక్ సిబ్బంది సాహసమే చేశారు. చెరువులో ఈదుకుంటూ వెళ్లి.. ఒకరికొకరు పరస్పర సమన్వయంతో హైవోల్టేజ్ లైన్‌కు మరమ్మతులు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. విద్యుత్ పునరుద్ధరణకు చెల్పూర్ చెరువులో ఈదుకుంటూ వెళ్లి మరమ్మతు చేస్తున్న దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చెల్పూర్ నుంచి హుజురాబాద్‌కు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ లైన్లో ఇన్సులేటర్ బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య ఎక్కడ వచ్చిందోనని పరిశీలించగా.. చెల్పూరు చెరువులో బ్రేక్‌డౌన్ అయినట్లుగా సిబ్బంది గుర్తించారు. చెల్పూర్‌కు చెందిన జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్లు.. వెంకటేశ్వర్లు, పరమేశ్, సమ్మయ్యలు చెరువులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ లైన్ బాగు చేశారు. విద్యుత్ పునరుద్దరణకు చేస్తున్న ప్రయత్నాలు చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారు. సిబ్బంది పని తీరును ట్రాన్స్‌కో ఎస్ఈ గంగాధర్ అభినందించారు.