Villegers Helped Pregnant Lady To Cross River : వరదలో.. గర్భిణిని చేతులపై మోసుకెళ్లి.. వాగు దాటించిన స్థానికులు.. - ఆదిలాబాద్ జిల్లా న్యూస్
Published : Sep 23, 2023, 4:40 PM IST
Villegers Helped Pregnant Lady To Cross River : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరీ మండలం కరంజి వాడ గ్రామంలోని బోరిలాల్ గూడ అనార్ పల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రజలు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌కు వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే. ఈ క్రమంలోనే కరంజివాడ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి జాదవ్ అశ్విని, నెలవారి వైద్య పరీక్షల కోసం ఆదిలాబాద్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. కానీ, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరగడంతో ఆసుపత్రికి వెళ్లడం వాయిదా వేస్తూ వచ్చారు.
వాగులో వరద ప్రవాహం కొంచెం తగ్గడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అందరూ కలిసి చేతులపై గర్భిణిని మోసుకెళ్లి ఒడ్డుకు చేర్చారు. నడుము లోతుకు పైగా ఉన్న నీటిలో స్థానికులు ప్రాణాలకు తెగించి గర్భిణిని వాగు దాటించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం జాదవ్ అశ్వినిని కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనార్ పల్లి వాగుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కరంజి వాడ గ్రామ ప్రజలు ఆదిలాబాద్ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు గడిచిన తమ గోడును వినే నాయకులు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.