Vegetable Price Hike : మండుతున్న కూరగాయల ధరలు.. ఖాళీ సంచులతో తిరిగి వెళ్తున్న జనం - మిర్చి ధర పెంపు
Vegetable Price Hike in Telangana : కూరగాయల ధరలు సామాన్యుల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఒకప్పుడు వంద రూపాయలకు నాలుగైదు రకాల కూరగాయలు వచ్చేవి.. ఇప్పుడు కనీసం ఒక్క కూరగాయ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది చూసినా కిలో వంద రూపాయలకు తక్కువగా లేదని వాపోతున్నారు. ముఖ్యంగా టమాట ధర మంట పెడుతోందంటున్నారు. ఇక మిర్చి.. ఘాటు సంగతెలా ఉన్నా ధర మాత్రం కంటతడి పెట్టిస్తోందని చెబుతున్నారు.
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యకం చేస్తున్నారు. టమాట కిలో ధర వంద రూపాయలు పలుకుతోందని.. కిలో పచ్చి మిర్చి రూ.120కి అమ్ముతున్నారని వాపోతున్నారు. కూరగాయల వాడకం తగ్గించినా.. టమాట, పచ్చిమిర్చీ వాడటం తప్పదు కాబట్టి.. ముందు కంటే కాస్త తక్కువగా వాడుకుంటున్నామని చెబుతున్నారు. వంకాయ, బెండకాయ కూడా రూ.60 ఉన్నాయని.. ప్రస్తుతం వీటి ధర మాత్రమే కాస్త తక్కువగా ఉందని తెలిపారు.
మరోవైపు ధరల పెరుగుదలతో వినియోగదారుల సంఖ్య తగ్గిపోయిందని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. స్థానికంగా పంటలు పెద్దగా పండక పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటలు దిగుమతి చేస్తున్నారని, ఆ కారణంగానే ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు.