Vanasthalipuram Fire Accident Today : వనస్థలిపురం బ్యాగుల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం - telangana latest news
Published : Oct 16, 2023, 10:17 AM IST
Fire Accident in Vanasthalipuram : భాగ్యనగరంలో అగ్నిప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలకొక చోటైనా అగ్నిప్రమాదం జరుగుతండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్ ట్యాంక్ సమీపంలో వీఐపీ లగేజ్ బ్యాగ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సుమారు రూ. 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమాని సంతోశ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.