Uttarakhand Rain 2023 : అంత్యక్రియల కోసం అవస్థలు.. బస్టాప్పై మృతదేహంతో 7కి.మీ.. మరో 3కి.మీ నడిచి.. - ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డి ఇబ్బందులు
Published : Sep 4, 2023, 7:32 PM IST
Uttarakhand Rain 2023 :ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. పౌఢీ జిల్లాలోని జ్వల్పాదేవి ఘాట్ సమీప ప్రాంతాల ప్రజల ఇక్కట్లు మరోలా ఉన్నాయి. ఆదివారం ఈ ప్రాంతంలో ముక్కంది లాల్ అనే వృద్ధుడు చనిపోయాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు నానా తంటాలు పడ్డారు కుటుంబ సభ్యులు. శ్మశాన వాటిక వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధం కావడం వల్ల అతికష్టం మీద అంత్యక్రియలు నిర్వహించారు.
సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని మోసుకుని కాస్త దూరం నడిచారు కుటుంబ సభ్యులు. అనంతరం శవాన్ని బస్టాప్ పైకి ఎక్కించారు. అలా దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. తర్వాత మరో మూడు కిలోమీటర్లు నడిచి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రోడ్లపై మట్టిదిబ్బలను, రాళ్లను తొలగించకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.