బడికి వెళ్లాలంటే కొండలు ఎక్కాల్సిందే.. చదువు కోసం పిల్లల సాహసం - ఉత్తరాఖండ్‌లో భారీ వర్షలతో ప్రజల అవస్థలు
Uttarakhand Heavy Rains : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ గ్రామ ప్రజల బాధ మరోలా ఉంది. అక్కడి విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఏకంగా కొండలనే ఎక్కాల్సి వస్తోంది.
ఆ ఊరి చుట్టు ఉన్న దాదాపు 30కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. దీంతో స్థానికులతో పాటు విద్యార్థులూ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొండలు ఎక్కేందుకు చిన్నారులు.. తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నారు. ప్రమాదకరమైన కొండలు ఎక్కుతున్న సమయంలో చిన్నారులు జారీ కింద పడతారేమోనని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. గోపేశ్వర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల మరో రెండు మూడు గ్రామాల ప్రజలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని చమోలీ జిల్లా కలెక్టర్ తెలిపారు. దాదాపు 150 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి స్కూల్కు వెళుతున్నారని ఆయన వెల్లడించారు. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.