Uttam Kumar Reddy Meeting : 'సొంత పార్టీ వారే తనపై.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు' - నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్
Uttam Kumar Reddy Meeting In Nalgonda : సొంత పార్టీ వారే తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయిస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన శాసనసభ ఎన్నికల సన్నాహక సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌లో 50వేలు మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోతే ఇక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు కమిషన్లకు కక్కుర్తి పడటంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందన్నారు. కోదాడలో ల్యాండ్, ఇటుక, మైన్స్, వైన్స్‌లల్లో కమిషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.